మోడీ క్యాబినెట్ లో ఏకైక తెలుగోడు కిషన్ రెడ్డి

Kishan Reddy is the only telugu person in the Modi Cabinet

నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి లోక్ సభ స్థానానికి ఎంపికైన ఆయన మోడీతో ఉన్న సాన్నిహిత్యం వలన మంత్రివర్గంలో చేరారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు వ్యక్తి కిషన్ రెడ్డి కావడం గమనార్హం. సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు మొదటి సారిగా ఎన్నికైన ఆయన మొదటి సారే మంత్రి పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే స్థానానికి పరిమితమైన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో అద్భుతంగా పుంజుకుని 4 లోక్ సభ స్థానాలను ఖాతాలో వేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి కోటలా ఉన్న కరీంనగర్‌ తో పాటు నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ సొంత కూతురు కవితను సైతం బీజేపీ ఓడించడం అనేది ఆశ్చర్యం కలిగించింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పట్ల ఫోకస్ పెట్టిన బీజేపీ కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంది. 2014లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన బండారు దత్తాత్రేయకు కూడా మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. కానీ ఆయన మధ్యలో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేసిన అనూహ్యంగా ఓడిన కిషన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో దత్తన్న స్థానం నుంచి పోటీ చేసి తలసాని కుమారుడిపై గెలుపొందారు. హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి తోలుత కాస్త తడబడ్డారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.