కేసీఆర్‌ లేని సమస్యను సృష్టిస్తున్నారు

కేసీఆర్‌ లేని సమస్యను సృష్టిస్తున్నారు

ధాన్యం కొనుగోలుపై రైతులను టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మంళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దీక్ష చేసినా రైతులు పట్టించుకోవడం లేదని అన్నారు. బాయిల్డ్ రైస్‌ ఇవ్వబోమని కేసీఆర్‌ లేఖ ఇచ్చారా? లేదా? చెప్పాలన్నారు. బాయిల్డ్‌ రైస్‌ ఎవరూ తినడం లేదని తెలిపారు. బాయిల్డ్‌ రైస్‌ సేకరణను ఎఫ్‌సీఐ నిలిపివేసిందని గుర్తుచేశారు. ‘రా రైస్‌’ తీసుకోవడానికి కేంద్రం ఇ‍ప్పటికీ సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ లేని సమస్యను సృష్టిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని సీఎం కేసీఆర్‌ లేఖ ఇచ్చారని అన్నారు.

గత సీజన్‌ గురించి తాను చెప్పిన విషయాన్ని వక్రీకరించారని మండిపడ్డారు. ఒప్పందం ప్రకారం చివరి గింజవరకు కొంటామని తెలిపారు. గత సీజన్‌లో ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని అన్నారు. లేని వడ్ల సమస్యను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎవరూ ఉ‍ప్పుడు బియ్యం తినడం లేదని, ఉపయోగం తగ్గిందని తెలిపారు. కేంద్రం వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని అన్నారు. ఉచితంగా ఇచ్చినా తీసుకోవడం లేదని తెలిపారు. రైతులను టీఆర్‌ఎస్‌ భయపెడుతోందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.