వ్యవసాయ రంగానికి సంస్కరణలు

వ్యవసాయ రంగానికి సంస్కరణలు

వ్యవసాయ రంగానికి సంస్కరణలు ఎంతో అవసరమని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ అభిప్రాయపడ్డారు. మూడు సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అన్నది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి ఎదురుదెబ్బగా పేర్కొన్నారు. సాగు చట్టాల వల్ల రైతులకు అధిక ధర లభించేదని.. వారి ఆదాయం రెట్టింపు చేయాలన్నది సాకారం అయ్యేదని పేర్కొన్నారు.

వ్యవసాయ సంస్కరణలపై రాష్ట్రాలతో సంప్రదింపులను తిరిగి ప్రారంభించాలని సూచించారు. సంస్కరణలు కోరుతూ కొందరు నీతి ఆయోగ్‌ను సంప్రదించినట్టు చెప్పారు. అయితే ఏ రూపంలో సాగు సంస్కరణలు ఉంటాయన్నది తెలుసుకునేందుకు కొంత సమయం వేచి చూడాలన్నారు. ‘‘సాగు రంగానికి సంస్కరణలు ఎంతో ముఖ్యం. కొందరు రైతులు సాగు చట్టాలను వ్యతిరేకించారు.

రాష్ట్రాలతో తాజా సంప్రదింపులు మొదలు పెట్టడమే దీనికి పరిష్కారం’’అని రమేష్‌ చంద్‌ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది మోదీ సర్కారు లక్ష్యం. దీనిపై ఎదురైన ప్రశ్నకు రమేష్‌ చంద్‌ స్పందిస్తూ.. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించాలంటే సంస్కరణలు శరణమ్యమని చెప్పారు.