గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన ఉదంతాలు మాత్రమే చూశాం. ప్రస్తుతం మాంజా పూసిన దారం మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన సంచలనం రేకిత్తిస్తోంది.
కటక్–చాంద్‌బాలి జాతీయ రహదారిలోని పీర్ బజారు ప్రాంతంలో సోమవారం ఉదయం కటక్‌లోని తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్న జయంత్ సామల్ పీకకు ఓ తెగిన గాలిపటం దారం ఒకటి చుట్టుకుంది. ఒక చేత్తో దాన్ని పక్కకు లాగుతూనే కొంతదూరం వెళ్లారు. ఈ ప్రయత్నంలో పతంగికి ఉన్న దారం అతని గొంతును కోసేసింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.అదృష్టవశాత్తు అతడితో పాటు బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన మరుక్షణమే స్థానికులు చొరవ కల్పించుకుని చేరువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరినీ చేర్చారు. ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు జయంత్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగత్‌పూర్ ఠాణా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.