దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్య బాధ్యతలు వహించే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఒకటి రెండ్రోజుల్లో బీసీసీఐ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గాయం నుంచి కోలుకోపోతే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కేఎల్ రాహుల్ ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక జనవరి 19నుంచి భారత్- దక్షిణాఫ్రికా మద్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.