‘‘అవును.. నిజంగా ఇది చాలా ప్రత్యేకం. ప్రతి సెంచరీ మనకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. శతకం సాధించినపుడు అనేకానేక భావోద్వేగాలు చుట్టుముడతాయి. అయితే, ఇలా 6-7 గంటల పాటు క్రీజులో నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ఎంతో ప్రత్యేకం’’ అని టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి అజేయంగా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు.
కాగా మూడు టెస్టులు, మూడు వన్డేల నిమిత్తం టీమిండియా సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 26న తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించగా… తొలిరోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో పలు రికార్డులు నమోదు చేశాడు. 248 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ నేపథ్యంలో తన ఇన్నింగ్స్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన రాహుల్.. పూర్తిస్థాయిలో సన్నద్ధమై ప్రణాళికలను పక్కాగా అమలు చేశామన్నాడు. ‘ప్రాక్టీసు సమయంలో ఏమేం అనుకున్నామో అవన్నీ ఆచరణలో పెట్టాము. మొదటి రోజు అందరూ బాగా ఆడారు. నిజానికి నేను గంటల కొద్దీ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే రకం కాదు. అయితే, ఎలా ఆడాలి, ఇన్నింగ్స్ ఎలా ఆరంభించాలి.. ఎలా దానిని కొనసాగించాలి అన్న అంశాల గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తా’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక సెంచరీ మిస్ చేసుకోవద్దని భావించానన్న రాహుల్… ‘‘99 పరుగుల వద్ద ఉన్నపుడు… స్పిన్నర్ బౌలింగ్. ఆచితూచి ఆడాలనుకున్నా.. మంచి అవకాశం మిస్ చేసుకోకూడదు కదా. ఒక్క సింగిల్ తీస్తే సెంచరీ. షాట్ ఆడేందుకు టెంప్ట్ అయినా సరే ఆచితూచి వ్యవహరించాను. అసలు నేను అలా ఎలా.. అంత సైలెంట్‌గా ఉన్నానో అర్థం కాలేదు. ఏదేమైనా ఈ ఇన్నింగ్స్ పట్ల చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాను’’అని రాహుల్ చెప్పుకొచ్చాడు.