ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ అరెస్ట్ః ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌లు

Kodandaram arrested by Police at Tank Band for TJAC's Million March

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ పై మిలియ‌న్ మార్చ్ స్పూర్తి ర్యాలీ త‌ల‌పెట్టిన తెలంగాణ రాజ‌కీయ ఐకాస చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తార్నాక‌లోని కోదండ‌రాం ఇంటి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. కోదండ‌రామ్ తో పాటు ఆయ‌న అనుచ‌రులైన పలువురు టీజేఏసీ కార్య‌క‌ర్త‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ స‌మ‌యంలో పోలీసుల‌కు, కోదండ‌రామ్ కు మ‌ధ్య వాగ్వాదంచోటుచేసుకుంది. అరెస్ట్ అనంత‌రం కోదండ రామ్ ను బొల్లారం పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. జేఏసీ చేప‌ట్టిన మిలియ‌న్ మార్చ్ స్ఫూర్తి స‌భ‌పై ఎక్క‌డిక‌క్క‌డ ఆంక్ష‌లు విధించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా… భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.

ట్యాంక్ బండ్ తో పాటు చుట్టుప‌క్క‌ల ప‌రిస‌రాల‌ను పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. కోదండరాం ఇంటి వ‌ద్ద ఉదయం నుంచే భారీగా మోహ‌రించిన పోలీసులు ఆయ‌న ఇంటినుంచి బ‌య‌ట‌కు రాగానే అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిర‌సిస్తూ జేఏసీనేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోరాటాల‌ను అణిచివేస్తారా…? అంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు ఆంక్ష‌ల‌తో ఉద్య‌మ ఆకాంక్ష‌లు ఆప‌లేర‌ని స్ప‌ష్టంచేశారు. మరోవైపు ట్యాంక్ బండ్ కు బ‌య‌లుదేరిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్క‌డినుంచి ఆయ‌న‌ను త‌ర‌లించారు. అరెస్టుల సంద‌ర్భంగా ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త‌తలు చెల‌రేగాయి.