ఆఫ్రిది వ్యాఖ్య‌ల‌కు దీటుగా బ‌దులిస్తున్న సెలబ్రిటీలు

Kohli and Javed Akhtar Responds to Afridi Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జ‌మ్మూకాశ్మీర్ లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, అణిచివేత పాల‌న‌కు వ్య‌తిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న అమాయ‌క ప్ర‌జ‌లు అన్యాయంగా తుపాకీ తూటాల‌కు బ‌లైపోతున్నార‌ని, భార‌త్ పై ఐక్య‌రాజ్య‌స‌మితి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్య‌ల‌పై భారత్ లో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌లువురు ప్ర‌ముఖులు ఆఫ్రిది వ్యాఖ్య‌ల‌కు దీటుగా బ‌దులిస్తున్నారు. ఇప్ప‌టికే భార‌త మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఆఫ్రిది వ్యాఖ్య‌ల‌పై సెటైర్లు వేశాడు. ఆఫ్రిది మాట‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, నోబాల్ కు వికెట్ తీసి అత‌ను సంబ‌రాలు చేసుకుంటున్నాడ‌ని ఎద్దేవాచేశాడు. ఆఫ్రిది నిఘంటువులో యూఎన్ అంటే అండ‌ర్ -19 క్రికెట్ అని గంభీర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్ర‌ముఖ ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ కూడా ఆఫ్రిది ట్వీట్ పై స్పందించారు. త‌న జాతి ప్ర‌యోజనాల‌ను వ్య‌తిరేకించే ఎవ‌రి అభిప్రాయాల‌కూ త‌న మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని, కొన్ని అంశాల‌పై స్పందించాలా… వ‌ద్దా అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రి వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, ఓ అంశంపై పూర్తి అవ‌గాహ‌న లేకుండా తాను మాట్లాడ‌న‌ని, త‌న వ‌ర‌కు దేశ‌ప్ర‌యోజ‌నాలే ముందుంటాయ‌ని ట్వీట్ చేశాడు. ఆఫ్రిది వ్యాఖ్య‌ల‌పై కోహ్లీ ఇలా మెత‌క‌గానే స్పందించాడు కానీ… ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ అయితే తీవ్ర ప‌ద‌జాలంతో ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు.

ప్ర‌శాంత‌మైన జ‌మ్మూకాశ్మీర్ ను చూడాల‌నుకుంటే… పాకిస్థాన్ నుంచి భార‌త్ లోకి చొర‌బ‌డే ఉగ్ర‌వాదుల‌ను నియంత్రించేలా చ‌ర్య‌లు చేప‌డితే బాగుంటుంద‌ని ఆఫ్రిదికి సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. డియ‌ర్ ఆఫ్రిది… జ‌మ్మూకాశ్మీర్ లో ఎలాంటి ఆందోళ‌న‌లు లేకుండా, మీరు ప్రశాంతత‌ని చూడాల‌నుకుంటున్నారా. అయితే పాక్ ఉగ్ర‌వాదులు, భార‌త్ లోకి చొర‌బ‌డ‌కుండా చూడండి. ఉగ్ర‌వాద శిక్ష‌ణా శిబిరాల‌ను మూసివేసేలా… వేర్పాటు వాదుల‌కు పాక్ ఆర్మీ మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఆపండి. అప్పుడు ఈ స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం దొరికేందుకు పెద్ద స‌హాయం చేసిన‌ట్ట‌వుతుంది అని జావేద్ అక్త‌ర్ ట్వీట్ చేశారు.