కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌

కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ శైలి, తన బ్యాటింగ్‌ శైలి వేర్వేరు అని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అభిప్రాయడ్డాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని, అలాంటి దిగ్గజంతో తనను పోల్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుందని వెల్లడించాడు. అయితే, వ్యక్తిగతంగా తనకు పోలికలంటే ఇష్టముండదని, ముఖ్యంగా కోహ్లీ లాంటి ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ఆటగాడితో పోలిస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌పై మూడు శతకాలు చేయడం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, అప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించాడు. ప్రతి మ్యాచ్‌ను ఆఖరి మ్యాచ్‌లా ఆడతానని, ఈ క్రమంలో రికార్డులు వాటంతట అవే తన ఖాతాలో చేరుతున్నాయని ఆయన వెల్లడించాడు.కాగా, పాక్‌ అభిమానులు, మాజీలు ఇకపై తనను కోహ్లీతో పోల్చడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

కోహ్లీలా తాను కూడా ఉన్నత శిఖరాలకు చేరాలంటే అభిమానులు ఇటువంటి పోలికలను పక్కకు పెట్టాలని సూచించాడు. మైదానంలో నా ప్రతిభ జట్టు విజయాలకు దోహదపడాలని, నా దేశం గర్వించే స్థాయికి నేను ఇంకా ఎదగాల్సి ఉందని ఈ పాక్‌ యువ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌.. కోహ్లీని అధిగమించి టాప్‌ ప్లేస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్ల ఈ పాక్‌ కెప్టెన్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం.