టీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ : కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట

Komatireddy Venkat Reddy and Sampath Kumar Gets Relief In HC

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగ సమయంలో గందరగోళం సృష్టించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రెండు జీవోలను కూడా విడుదల చేసింది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లపై విధించిన నిషేధం చెల్లదని.. వారి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.

అయితే వారి సభ్యత్వం రద్దుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంలో ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్‌ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించగా.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది