Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహేశ్ ఒప్పుకోకపోతే భరత్ అను నేను లేనేలేదంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. విడుదలైన రోజు నుంచి భారీ వసూళ్లతో టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న భరత్ అను నేను విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు యాక్షన్, కొరటాల శివ తెరకెక్కించిన విధానం సినిమాను అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి. సాధారణంగా ఓ సినిమా పెద్ద హిట్టయినప్పుడు ఈ హీరోకు బదులు మరో హీరో ఆ సినిమా చేసిఉంటే..ఎలాగుంటుంది అన్న అభిప్రాయం… సాధారణ ప్రేక్షకుల నుంచి… దర్శక నిర్మాతలదాకా అందరికీ కలుగుతుంది. అలాగే భరత్ అను నేను మహేశ్ బాబుకు బదులు మరో హీరో ఎవరైనా చేస్తే ఎలా ఉండేది అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు.
దర్శకుడు కొరటాల శివను కూడా చాలా మంది మహేశ్ బాబుతోనే భరత్ అను నేను చేయాలనుకోవడానికి కారణమేంటని అడుగుతున్నారు. దానికి సమాధానమిస్తూ..కొరటాల సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ప్రత్యేకతే…ఆయను ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి కారణమని చెప్పారు. అనవసరంగా కోపం తెచ్చుకోని ముఖ్యమంత్రి పాత్ర ఇదని, గొంతు పెంచి గట్టిగా మాట్లాడడం, స్పీచ్ లు దంచేయడం ఈ పాత్రలో కనిపించవని, అవతలవారికి అర్దమయ్యేలా సూటిగా..సున్నితంగా చెప్పే పాత్ర ఇదని, ఈ లక్షణాలు మహేశ్ బాబులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని..అందువల్లే ఆయనను తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే….మహేశ్ కుదరదని చెప్పి ఉంటే ఈ సినిమాయే లేదన్నారు కొరటాల. సినిమా హిట్టయిన తర్వాత దర్శకుడు,హీరోను ఒకరినొకరు పొగుడుకోవడం ఎప్పుడూ జరిగేదే కానీ..నిజానికి ప్రేక్షకులు సైతం భరత్ అను నేనుపై ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మహేశ్ బాబు తప్ప మరే హీరో అయినా ముఖ్యమంత్రి పాత్ర ఇంత అద్భుతంగా ఉండేది కాదన్న అభిప్రాయం అన్ని రివ్యూలలోనూ వ్యక్తమవడం విశేషం.