కృష్ణానది మహోగ్రరూపం…వణుకుతున్న విజయవాడ  

Krishna river mahograpam ... trembling Vijayawada!

కృష్ణానది మహోగ్రరూపం దాల్చడంతో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దీంతో వరద బాధిత ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న 8 లక్షల క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు.

దీంతో లోతట్టు ప్రాంతాలకు మరింత ప్రమాదం పొంచి ఉంది. కరకట్ట వద్ద గంటగంటకు ప్రవాహం రెట్టింపవుతోంది. పరివాహక ప్రాంతంలోని గ్రామాలన్నీ నీటమునిగాయి. కరకట్ట వెంబడి ఉన్న పలు కాలనీల్లోకి ఇప్పటికే వరద నీరు చొచ్చుకువచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పుల వరకు నీరు చేరింది.

లంక గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతూ బిక్కుబిక్కుమంటున్నారు. మత్స్యకారుల బోట్లు, వలలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పడవలను కాపాడుకునేందుకు మత్స్యకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విజయవాడ కృష్ణలంక కాలనీల్లో ఎటుచూసినా నీరే కనిపిస్తోంది.

ఇళ్ల నుంచి సామాన్లు తీసుకుని కరకట్టపై ఉంచి డేరాలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.  కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలోని కొంత ప్రాంతానికి వరద నీరు చేరింది.