తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ధక్ ధక్ ధక్ అంటూ కుర్రకారుల గుండె తలుపు తట్టింది కృతీ శెట్టి. తనకు వచ్చిన క్రేజ్‌తో ఫట్ ఫట్ ఫట్ అంటూ అందివచ్చిన ఆఫర్లు అన్నింటినీ చేసుకుంటూ పోతోంది. దీంతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది కృతీ. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు అరడజను సినిమాలున్నట్లు తెలుస్తోంది.
నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు తమిళ చిత్రసీమలో ధనుష్ సరసన నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు సంతకం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మ కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ సమయంలో వినూత్న చిత్రాల దర్శకుడు తేజ తన కొత్త సినిమా కోసం కృతీ శెట్టిని సంప్రదించాడట.
దగ్గుబాటి అభిరామ్ వెండితెర అరంగ్రేటం చేయనున్న సినిమాలో బేబమ్మ నటిస్తే ప్లస్ అవుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది. కానీ చేతిలో ఇప్పటికే ఎన్నో ఆఫర్లు ఉండటంతో తేజ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట. అయితే తేజ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తపడతాడు. అలాంటి దర్శకుడికి బేబమ్మ తొందరపడి నో చెప్పిందా? అని సినీప్రియులు చర్చించుకుంటున్నారు.