న‌గ‌దు కొర‌త లేద‌న‌డంపై తెలుగు మంత్రుల ఆగ్ర‌హం

KTR and Nara Lokesh comments on Arun Jaitley over Cash Crunch

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

న‌గ‌దు కొర‌త‌తో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంటే… కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం అస‌లు ఈ స‌మ‌స్యే లేద‌న్న‌ట్టుగా మాట్లాడ‌డంపై రెండు రాష్ట్రాల మంత్రులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. వాస్త‌వ ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌కుండా అంతా బాగుంది అంటూ అరుణ్ జైట్లీ బాధ్య‌తార‌హితంగా మాట్లాడ‌డం బాధాక‌ర‌మ‌ని ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిప‌డ్డారు. ఈ విష‌యంపై మంత్రి వ‌రుస ట్వీట్లు చేశారు. ఏపీలో న‌గ‌దు అందుబాటులో లేక ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ప‌రంగా పెన్ష‌న్లు, ఉపాధి హామీ వేత‌నాల చెల్లింపులో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో ప‌రిస్థితిని వివ‌రిస్తూ న‌గదు స‌ర‌ఫ‌రా చేయాల‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి లేఖ రాయ‌డంతో పాటు అనేక సార్లు కేంద్రాన్ని కోరినా ఫ‌లితం లేద‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి న‌గ‌దు అందుబాటులోకి తీసుకురావాల‌ని కోరారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అరుణ్ జైట్లీ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

బ్యాంకులు, ఏటీఎంల‌లో న‌గ‌దు కొర‌త జైట్లీ చెప్పిన‌ట్టుగా ఆక‌స్మికంగానో లేదా తాత్కాలికంగానో రాలేద‌ని, ఈ విష‌యమై మూడు నెల‌లుగా హైద‌రాబాద్ లో త‌ర‌చూ ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. బ్యాకింగ్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని క్ర‌మంగా వ‌మ్ము చేస్తోన్న స‌మ‌స్య‌పై ఆర్ బీఐ, ఆర్థిక మంత్రిత్వ‌శాఖ లోతుగా ప‌రిశీలించాల‌ని ఆయ‌న సూచించారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా న‌గ‌దు కోసం ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్ట‌ర్ లో స్పందించారు. దేశంలో క‌రెన్సీ ప‌రిస్థితుల‌ను స‌మీక్షించామ‌ని, ఈ స‌మ‌స్య తాత్కాలిక‌మేన‌ని, త్వర‌లోనే దీన్ని ప‌రిష్క‌రిస్తామ‌ని హామీఇచ్చారు. మొత్తంగా కావాల్సిన న‌గ‌దు కంటే ఎక్కువ న‌గ‌దే చ‌లామ‌ణిలో ఉంద‌ని, బ్యాంకుల్లోనూ న‌గ‌దు అందుబాటులో ఉంద‌ని, అయితే కొన్ని ప్రాంతాల్లో అసాధార‌ణంగా, అక‌స్మాత్తుగా న‌గ‌దు వినియోగం పెర‌గ‌డం వ‌ల్ల క‌రెన్సీ స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని అరుణ్ జైట్లీ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇది తాత్కాలిక‌మే అని, త్వ‌రలోనే ప‌రిష్క‌రిస్తామ‌ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైనే లోకేశ్, కేటీఆర్ స్పందించారు. వారిద్ద‌రే కాదు… అంద‌రూ ఇదే అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు. దేశ ప్ర‌జ‌ల తీవ్ర స‌మ‌స్య‌ను జైట్లీ తాత్కాలికమైన‌దిగా భావించ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.