ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో జోక్యం చేసుకోండిః రాష్ట్ర‌ప‌తికి వైసీపీ విజ్ఞ‌ప్తి

YSRCP MP's meets Ramnath Kovind for AP Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో క‌లుగజేసుకోవాల‌ని వైసీపీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞ‌ప్తిచేసింది. ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తిని క‌లిసి త‌మ రాజీనామాల‌కు దారితీసిన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర ప్ర‌సాద్, వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి రాష్ట్ర‌ప‌తిని క‌లిశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం నాలుగేళ్లుగా చేస్తున్న పోరాటం, ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో పాటు అన్ని అంశాల‌ను వివ‌రిస్తూ రాష్ట్ర‌ప‌తికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. ఏపీని కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌డం లేద‌ని ఆరోపించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం తీరుతో రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని, ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరారు.

రాజ్యంగప‌రంగా తాను ఏం చేయ‌గ‌లనో అది చేస్తాన‌ని రామ్ నాథ్ కోవింద్ త‌మ‌కు హామీఇచ్చార‌ని వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మీడియాతో అన్నారు. రాష్ట్ర‌ప‌తికి తాము అన్ని విష‌యాలూ వివ‌రించామ‌న్నారు. ప్ర‌త్యేక‌హోదా ఏపీ ప్ర‌జ‌ల హక్క‌ని, ఎప్ప‌టికైనా సాధించుకుంటామ‌ని, విభ‌జ‌న హామీలు ఇప్ప‌టికైనా అమలు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న వైఖ‌రితో ఏపీకి న‌ష్టం వాటిల్లింద‌ని విమ‌ర్శించారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం చిత్త‌శుద్ధితో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశామ‌ని, త‌మ రాజీనామాలు త‌ప్ప‌కుండా ఆమోదం పొందుతాయ‌ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై క‌ల్పించుకుని, త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర‌ప‌తిని కోరామని తెలిపారు.