వచ్చే ఎన్నికల్లో మద్దతు ఆ పార్టీకే…జగన్ ప్రకటన

jagan declared he will support party gives special status

ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంట్‌లో జరిగిన చర్చలో పాల్గొనే అవకాశాన్ని రాజీనామాలతో కోల్పోయిన వైసీపీ.. తన వాదనను కాకినాడలో వినిపించింది. విభజన హామీలపై పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసింది. ఆ చర్చను వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవలేదు. సాయంత్రం వరకూ ఆయన కోర్టులో ఉన్నారు. కానీ సాయంత్రం మాత్రం తాను చాలా దగ్గరగా పార్లమెంట్‌ సమావేశాల్ని ఫాలో అవుతున్నానని ఉదయమే స్పందిస్తానని ట్వీట్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారన్న ప్రశ్నకు జగన్ ఒక్క మాటతో తేల్చేశారు. కాకినాడ పాదయాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సంత‌కం చేస్తారో వారికే మ‌ద్ద‌తిస్తామని ఈ సందర్భంగా తేల్చిచెప్పేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల బలీయమైన ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను, రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా అవిశ్వాసంపై చర్చలో తమ ఎజెండాను మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రస్తావించాయని ఆయన తప్పుబట్టారు.

అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి కారణం ప్రత్యేకహోదాపై కేంద్రం తీరుకు నిరసనగానట. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వాయిస్‌ని వినిపించే అవకాశాన్ని రాజీనామాల ద్వారా పోగొట్టుకున్న వైసీపీ అధినేత జరిగిపోయిన డ్యామేజీని కొద్దిగా అయినా కంట్రోల్ చేసుకునేందుకు కాకినాడలో ప్రెస్‌మీట్ పెట్టారు. నరేంద్రమోడీ పార్లమెంట్‌లో చెప్పిన మాటల ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు. నాలగేళ్లు పాటు హోదా కోసం పోరాడిన పార్టీ తమదేనని సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. కానీ అసలు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కానీ ఎక్కడా ఒక్క మాట అనడానికి ప్రయత్నించలేదు జగన్. ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూసి తనకు బాధేస్తోందన్నారు కానీ అలా ఎందుకు చేస్తున్నారు ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వరని మాత్రం డిమాండ్ చేయలేకపోయారు. కనీసం నరేంద్రమోడీ పేరు ఎత్తే ప్రయత్నం కూడా చేయలేకపోయారు.