జగన్ ఇంటి ఆడవాళ్ళ జోలికా….పవన్ !

Pawan requests his fans to stop trolling jagan family

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ ల మధ్య రాజకీయ ఆరోపణలు వ్యక్తిగత స్థాయికి వెళ్ళడం అప్పుడు జగన్ పవన్ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావించడం తెలిసిన సంగతే. అయితే ఆ జగన్ ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ పేరిట చాలా మంది జగన్ సోదరి షర్మిలని రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే శ్రీ రెడ్డి విషయంలో తన ఫ్యాన్స్ ఎన్ని మాటలు అన్నా ఊరుకున్న పవన్ మరి ఈ విషయాన్నీ రాజకీయంగా తీసుకున్నారో ఏమో సోషల్ మీడియాలో షర్మిల, జగన్ ల మీద వస్తున్న ట్రోలింగ్ పోస్టులపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ ఈ వివాదంలోకి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ఆడపడుచులను, కుటుంబ సభ్యులను లాగవద్దని విన్నవించారు.

“ఈ మధ్యన జగన్ మోహన్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో ఎవరన్నా జగన్ మోహన్ రెడ్డిని కానీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితో ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన” అని పోస్టు పెట్టారు. అయితే ఫ్యాన్స్ కు జగన్ కుటుంబీకులను, ఆడ పడుచులను వివాదంలోకి లాగవద్దని సూచిస్తూ పెట్టిన ట్వీట్ లో చాలా వరకు స్పెలింగ్ మిస్టేక్స్ రావడంతో వాటిని సవరిస్తూ పవన్ కల్యాణ్ తన పాత ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ పెట్టారు.