జేడీ కి తత్వం బోధపడిందా ?

jd lakshmi narayana political entry in cross roads

జనం ఆలోచనలు భలే చిత్రంగా మారిపోతుంటాయి. ఒకప్పుడు తరతరాలుగా ఒకటి లేదా రెండు కుటుంబాలే రాజకీయాలు చేస్తుంటే ఎప్పుడూ వీళ్లేనా ఇక కొత్త వారికి అవకాశం రాదా అనిపించేది. ఇప్పుడు కొత్త కొత్త వాళ్లంతా రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకోడానికి వస్తుంటే వీళ్ళు రాజకీయం చేయగలరా అని డౌట్ పడుతున్నాం. వీళ్ళకి రాజకీయం అవసరమా అని కొందరి మీద పంచ్ లు కూడా పడుతున్నాయి. వీటన్నిటికీ భిన్నంగా వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏదైనా మేలు జరుగుతుందేమో అని ఆశిస్తాం. అలా ముందుకు వచ్చిన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ రాజకీయాల్లో నెట్టుకురాలేకపోవడంతో ఆ ఆశలు కూడా పక్కనబెట్టాం. ఆ తర్వాత అంతటి ఆశలు రేపకపోయినా కాస్త ఆసక్తి రేపిన వారిలో సిబిఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఒకరు.

J.D. లక్ష్మీనారాయణ ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పటి నుంచి కొన్ని కార్యక్రమాల్లో ఆయన మాట్లాడ్డం చూసాం. జగన్ అవినీతి కేసులకు సంబంధించి విచారణ జరుపుతున్నప్పుడు మీడియా వల్లనో , ఇంకే కారణం వల్లనో ఆయనకు ఓ హీరో ఇమేజ్ వచ్చేసింది. ఇక ఆయన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలతో ఆ ఇమేజ్ అలా నిలబడిపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి జేడీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనగానే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సహజమే. జేడీ ప్రసంగాలు చూస్తే కాస్త జాతీయ భావాలు ఎక్కువగా కనిపిస్తాయి. దానికి తోడు ఆయన మహారాష్ట్ర క్యాడర్ నుంచి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తానని చెప్పేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ ప్రస్తావన జోరుగా సాగుతోంది. అందుకే ఆయన్ని కూడా తెలుగు తమ్ముళ్లు కూడా సందేహపడ్డారు. ఇక అంత తొందరగా కొత్త వాళ్ళ మీద కామెంట్ చేయని సీఎం చంద్రబాబు సైతం ఓ దశలో జేడీ రాజకీయ ఆలోచనల మీద అదే తరహాలో డౌట్ వ్యక్తపరిచారు. దీంతో జేడీ రాజకీయ ప్రస్ధానం ఖాయం అనిపించింది.

జనం ఆలోచనలకు తగ్గట్టు జేడీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలు పర్యటించారు. రైతు సమస్యల మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఆ పర్యటనలు పూర్తి అయ్యాక జేడీ ఓ సమగ్ర ప్రణాళిక ప్రకటిస్తారు . ఆ వెంటనే ఏ పార్టీ లో చేరతారు అన్నది కూడా చెప్పేస్తారు అనుకున్నాం. పర్యటనల సందర్భంగా జేడీ వ్యాఖ్యల్ని బట్టి ఆయన బీజేపీ వైపు మొగ్గు జూపుతారు అన్న వాదనలు వినిపించాయి. అయితే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన నిర్ణయం తానే ప్రకటిస్తాను అని చెప్పారు. కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ జేడీ తో సన్నిహితంగా వ్యవహరించే కొందరి మాటల్ని బట్టి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. బీజేపీ మీద ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయనకు అర్ధం అయ్యిందట. దీంతో ఆ పార్టీ లో చేరే ఆలోచన ప్రస్తుతానికి పక్కనబెట్టారట. ఇక జనసేన విషయానికి వస్తే పవన్ చరిష్మా ముందు నిలబడి ఆ ప్రత్యేకత నిలబెట్టుకోవడం చాలా కష్టం. దీనికి తోడు ఆ పార్టీ భవిష్యత్ మీద కూడా నమ్మకం లేదు. దీంతో జేడీ సైలెంట్ అయినట్టు చెప్పుకోవడం చూస్తే బాధ కలుగుతోంది.

సీఎం కుర్చీ మాత్రమే కావాలని రాజకీయం చేస్తున్న జగన్ , తాను గెలవకపోయినా ఎదుటి వారిని ఓడిస్తానని చెప్పుకుంటున్న పవన్ లాంటి నాయకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సర్దుకుపోవచ్చు. కానీ జేడీ లాంటి వాళ్ళు కూడా లెక్కలు వేసుకుని రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం మాత్రం ఆశ్చర్యంగా వుంది. సమాజానికి ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళు అక్కడి పరిస్థితులు , వాటికి పరిష్కారాలు గురించి ఆలోచించాలి. వాటి మీద ప్రణాళికలు ప్రకటించాలి. వాటి అమలకు వీలైతే ప్రయత్నం చేయాలి. లేకుంటే అమలు అయ్యేలా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలి. పోరాటానికి సిద్ధపడాలి. అప్పుడు కచ్చితంగా సంపూర్ణంగా కాకపోయినా ఎంతోకొంత మేలు జరుగుతుంది.

అలా కాకుండా తాము పదవిలోకి వస్తే ఏదో చేస్తాం అన్న ధోరణి జేడీ స్థాయి వ్యక్తులకు సరిపోదు. ఆ ఆలోచనతో మాత్రమే జేడీ రాజకీయ ప్రకటన లేట్ అవుతుంటే గనుక ఆయన కూడా ఓ సగటు నేతగానే మిగిలిపోతాడు. రాజకీయ తత్వం బోధపడి యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసిన వారు అవుతారు. నాటి మహాభారతం లో లా ఇక్కడ ఏ కృష్ణుడు ఆయనకు గీత చెప్పలేరు. ఆయన మనసు , దీక్ష , పట్టుదలే ఏదైనా చేయగలుగుతాయి. ఆయన అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడు అవుతారో లేక శత్రు సంహారం చేసిన విజయుడు అవుతాడో చూడాలి…..అరుణాచలం