మరో ప్రత్యేక రాష్ట్రం కావాలట !

new revolution started for uttara karnataka special state

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దానిని స్పూర్తిగా తీసుకుని దేశంలో వివిధ రాష్ట్రాలకి చెందిన వారు కూడా ప్రత్యేక రాష్ట్రం తమకు కూడా కావాలని పోరాటం చేశారు. కానీ ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం అలాంటి సమస్యలు పెద్దవి కాకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు దక్షిణాదిన మరో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమం తీవ్ర తరం అయినట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తర కర్ణాటక హోరాట సమితి ప్రత్యేక రాష్ట్రానికి పిలుపునిచ్చింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్న 13 జిల్లాలను కలిపి నూతన రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఈ పోరాటానికి మద్దతు పలకాలని ఆగస్టు 2న బంద్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం హోరాట సమితి అధ్యక్షుడు సోమశేఖర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బడ్జెట్ లో ఉత్తర కర్ణాటకకు నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్షం చేశారని ఉత్తర కర్ణాటకకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించలేదని, నిధులు కేటాయించలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే మా ప్రాంతంలోని 13 జిల్లాలను తామే అభివృద్ది చేసుకుంటామని సోమశేఖర్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు తాము పోరాటం చేస్తామని సోమశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఏ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చినా ఉత్తర కర్ణాటకకు తీరని అన్యాయం చేస్తున్నారని సోమశేఖర్ ఆరోపించారు. అందుకే 13 జిల్లాలతో ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని సోమశేఖర్ డిమాండ్ చేశారు.