పార్టీలో చేరిక‌ల్ని కొన‌సాగిస్తున్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పార్టీలో చేరిక‌ల్ని కొన‌సాగిస్తున్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మున్సిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తెరాస ఘ‌న విజ‌య‌మే సాధించింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు ద‌రిదాపుల్లో క‌నిపించని స్థాయి ఫ‌లితాల‌ను ద‌క్కించుకుంది. అయినాస‌రే, పార్టీలో చేరిక‌ల్ని కొన‌సాగిస్తున్నారు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెరాస‌లో చేర‌దామ‌నుకుంటున్న‌వారిని వ‌ద్ద‌న‌డం లేదు. సొంతంగా తెరాస బ‌లం ఉన్న మున్సిపాలిటీల్లో కూడా ఇత‌ర పార్టీలు, స్వ‌తంత్రంగా పోటీ చేసి గెలిచిన‌వారిని తెరాస‌లో చేర్చుకుంటున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులుంటే, వాటిలో 14 తెరాస గెలుచుకుంది. ఓ ఎనిమిది మంది ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ త‌ర‌ఫున గెలిచిన‌వారున్నారు. వారిని తెరాస‌లో చేర్చుకున్నారు కేటీఆర్. పార్టీ కార్యాల‌యంలో అట్ట‌హాసంగా ఈ చేరిక‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేవారే లేర‌నీ, బీఫామ్ లు ఇస్తాం తీసుకోండ‌ని ఎంత‌మందికి చెప్పినా ప‌ట్టించుకోలేదంటూ విమ‌ర్శ‌లు చేశారు. భారీ మెజారిటీతో స్థానాలు గెలుచుకున్నాక కూడా ఇంకా ఎందుకీ వ‌ల‌స రాజ‌కీయాలు..? అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత కూడా ఇంతే… సొంతంగా మంచి సంఖ్యాబలం ఉన్నా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఒక్కొక్క‌రిగా ఆక‌ర్షించేశారు. సొంతంగా సంఖ్యాబ‌లం ఉన్న చోట్ల కూడా ఎందుకీ ప్ర‌హ‌స‌నం? అంటే… దీని వెన‌క సుదీర్ఘ రాజ‌కీయ వ్యూహ‌మే క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌మీప భ‌విష్య‌త్తులో బ‌ల‌ప‌డే అవ‌కాశాన్ని ఈ స్థాయి నుంచే తుంచేస్తున్న‌ట్టుగా చూడొచ్చు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల రెబెల్స్ గెలిచారు. మ‌రికొన్ని చోట్ల ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ల‌పై అభ్య‌ర్థులు గెలిచిన స్థానాలూ ఉన్నాయి. వాస్త‌వానికి ఎక్క‌డా తెరాస‌కు ఇత‌రుల మ‌ద్ద‌తు అంత‌గా అవ‌స‌రప‌డ‌లేదు.

అలాగ‌ని, గెలిచిన రెబెల్స్ నీ, స్వ‌తంత్రుల్నీ వ‌దిలేయ‌ద‌ల్చుకోలేదు వ‌దిలేస్తే ఏమౌతుందీ… వారు కాంగ్రెస్ వైపుగానీ, భాజ‌పావైపుగానీ స‌మీప భ‌విష్య‌త్తులో ఆక‌ర్షితులయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే, వారిని అటుగా ఆలోచించ‌కుండా అధికార పార్టీ ఆక‌ర్షిస్తోంది. సంఖ్యాబ‌లంతో మాకు సంబంధం లేదు, వ‌చ్చిన‌వారిని చేర్చుకుంటామ‌ని సంకేతాలు ఇవ్వ‌డం కోస‌మే ఈ చేరిక‌ల కార్య‌క్ర‌మాన్ని ఇంత ఘ‌నంగా కేటీఆర్ నిర్వ‌హించార‌ని చెప్పొచ్చు. ఈ వ‌ల‌స రాజ‌కీయాల వ‌ల్ల ప్ర‌జాతీర్పు అవ‌హేళ‌న‌కు గురౌతోంది క‌దా అనే ప్ర‌శ్న ఎప్పుడూ ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. తెరాస‌ను కాద‌ని ఇత‌ర అభ్య‌ర్థిని ప్ర‌జ‌లు ఎన్నుకున్నారంటే… అది తెరాస ప‌ట్ల వ్యక్తీకరించిన వ్య‌తిరేక‌తే. కానీ, ఈ వ‌ల‌స‌ల వ‌ల్ల దాన్ని కూడా తమ ప‌ట్ల ప్ర‌జ‌లు ప్ర‌క‌టించిన విశ్వాసంగానే ప్ర‌చారం చేసేసుకుంటున్నారు తెరాస నేతలు వాస్త‌వానికి, ఇలాంటి ప‌రిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ముందుండాలి. ఈ స్థాయి వ్యూహ‌ర‌చ‌న‌లో కాంగ్రెస్, భాజ‌పాలు ఇంకా వెన‌క‌బ‌డే ఉన్నాయి.