నగరంలో వరద పరిస్థితిపై మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో పాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు.. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లందరూ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రజలను ఫంక్షన్‌హాల్, కమ్యూనిటీ హాల్లకు తరలించాలని, వారికి అక్కడే ఆహారం, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. మూసి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ప్రస్తుత భారీ వర్షాలకు నగరంలో పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ పోల్స్ విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకోవాలన్నారు. నగర రోడ్లపైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్‌హోల్స్ ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలిని ఆదేశించారు. అధికారులు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలన్నారు.