రేవంత్ రెడ్డి రాజకీయాలు మానేసి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరో 10 నెలల్లో ఎన్నికలు వస్తాయంటూ రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ఈటల రాజేందర్‌ను గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు.
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని కేటీఆర్ అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ఇంకా ఖరారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్ని ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ప్రచారానికి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి ఎందుకు చేయట్లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్షాల కుట్రతోనే హుజురాబాద్‌లో దళిత బంధు పథకానికి బ్రేక్ పడిందని, నవంబర్ 3 తర్వాత దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈటల రాజేందర్ కొంతకాలం తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్తారని, వివేక్కి కూడా హస్తం వైపు మనసు మళ్లుతోందని కేటీఆర్ తెలిపారు. మంచి వ్యక్తైన భట్టి విక్రమార్క మాట కాంగ్రెస్ పార్టీలో నెగ్గడం లేదని, ఆ పార్టీలో ఇప్పుడంగా గట్టి అక్రమార్కులదేనని ఎద్దేవా చేశారు.