నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. హెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఓవైసీ జంక్షన్ టు మిధానీ జంక్షన్’ ఫ్లై ఓవర్‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ఉదయం ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కి అరుదైన గౌరవం ఇస్తూ ఫ్లై ఓవర్‌కు ఆయన పేరును నామకరణం చేశారు.
ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఫ్లైఓవర్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు శ్రీశైలం, బెంగళూరు, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుంది. నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే రూ.80 కోట్ల వ్యయంతో 1.365 కిలో మీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పుతో మూడు లైన్ల రహదారిగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది.