చిన్నిగుండెకు అండ

ktr on twitter rs 1 lakh released from cmrf

చిన్ని గుండెకు అండగా నిలిచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. బాలుడి గుండె ఆపరేషన్‌కు సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.లక్షకు ఎల్‌వోసీ ఇప్పించి ప్రాణదాతగా నిలిచారు. జనగామ జిల్లా, జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామ శివారు కొర్రతండాకు చెందిన కొర్ర శంకర్‌నాయక్, లలిత దంపతులకు నాలుగు నెలల కిందట కుమారుడు పృథ్వీరాజ్ చౌహాన్ జన్మించాడు. పుట్టినప్పటి నుంచి చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో పలు దవాఖానల్లో చూపించారు. చివరకు హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. బాలుడి గుండెకు రంధ్రం ఉన్నదని చెప్పారు.

ఆపరేషన్ కోసం రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆ నిరుపేద కుటుంబం రూ.రెండు లక్షలవరకు అప్పు తీసుకొచ్చింది. ఎంత తిరిగినా మిగతా రూ.లక్ష ఎక్కడా పుట్టలేదు. దీంతో ట్విట్టర్‌లో కేటీఆర్‌కు తమ పరిస్థితిని విన్నవించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి రూ.లక్షకు ఎల్‌వోసీ ఇప్పించారు. వారం కిందట బాలుడి గుండెకు వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. గురువారం బాలుడిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. తాము జీవితాంతం కేటీఆర్‌కు రుణపడి ఉంటామని చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.