చంద్ర‌బాబు అందుకే బ‌య‌ట‌కువ‌చ్చారు…

KTR says reason why Chandrababu breaks alliance with BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దేశంలో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. దేశం ఓ వైపు అభివృద్ధి చెందుతోంటే మ‌రోవైపు స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉన్నాయ‌న్నారు. ఢిల్లీలో జ‌రిగిన 51వ‌స్కోచ్ స‌ద‌స్సులో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి ప‌య‌నాన్ని వివ‌రించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ప్ర‌థ‌మ‌స్థానంలో ఉంద‌ని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ స‌మ‌స్య‌లు అధిగ‌మించి విద్యుత్ మిగులు రాష్ట్రంగా అవ‌త‌రించింద‌ని తెలిపారు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌గా రాష్ట్రం స‌మ్మిళ‌త అభివృద్ధి సాధిస్తోంద‌ని తెలిపారు. మిష‌న్ కాక‌తీయ‌, డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటింటికీ తాగునీరు వంటి కార్య‌క్ర‌మాల‌ను కేటీఆర్ స్కోచ్ స‌ద‌స్సులో వివ‌రించారు. కేసీఆర్ ప్ర‌తిపాదిస్తున్న తృతీయ ఫ్రంట్ పై కేటీఆర్ స్పందించారు.

కేంద్ర‌ప్ర‌భుత్వంలో కేంద్రీకృత‌మైన పెత్త‌నాన్ని ప్ర‌శ్నించేవిధంగా, ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తిబింబంగా ఓ కొత్త ప్ర‌త్యామ్నాయం వ‌స్తే మంచిద‌నే ఉద్దేశంతో ఓ చ‌ర్చ‌కు సీఎం శ్రీకారం చుట్టార‌ని, భ‌విష్య‌త్తులో ఇది మంచి ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య దెబ్బ‌తిన్న సంబంధాల‌పైనా కేటీఆర్ త‌న అభిప్రాయం వినిపించారు. కేంద్రం నుంచి ఈ మూడున్న‌రేళ్ల‌లో ఒక్క పైసా కూడా అద‌నంగా తెలంగాణ‌కు రాలేద‌ని, విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన విధంగా ఒక్క ఇన్ స్టిట్యూట్ ను కూడా ఇవ్వ‌లేద‌ని కేటీఆర్ ఆరోపించారు. ఏపీకి కొన్నయినా ఇచ్చార‌ని, తెలంగాణ‌కు మాత్రం ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేద‌ని, ఒక్క కొత్త సంస్థా రాలేద‌ని, త‌మ ద‌గ్గ‌ర లెక్క‌ల‌తో స‌హా ఉన్నాయ‌ని చెప్పారు. గ‌తంలో ఎన్నోసార్లు ప్ర‌ధాన‌మంత్రితో పాటు అనేక‌మంది మంత్రుల‌ను క‌లిసి విన్న‌వించినా మార్పురాలేద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎదుర‌యిన అనుభ‌వ‌మే ఆంధ్రామిత్రుల‌కు కూడా ఎదుర‌యిఉంటుంద‌ని, అందుకే వారు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని కేటీఆర్ విశ్లేషించారు. ఎన్డీఏకు కూట‌మిలో ఎవ‌రూ మిగ‌ల‌లేద‌ని, చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, శివ‌సేన వైదొలిగిన త‌ర్వాత, బ‌ల‌హీన ప‌డ్డ అకాళీద‌ళ్, బీజేపీ త‌ప్ప ఎన్డీఏలో ఎవ‌రూ లేర‌ని, కూట‌మి నుంచి అంద‌రూ ఎందుకెళ్లిపోతున్నారో కేంద్రం పునరాలోచించుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.