అద్వానీని అవ‌మానించిన మోడీ

Modi Insults LK Advani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రెండున్నర ద‌శాబ్దాల వామ‌ప‌క్షపాల‌నకు తెరదించి త్రిపుర‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసే చారిత్ర‌క‌ఘ‌ట్టాన్ని క‌నులారా వీక్షించ‌డానికి కాషాయ‌ద‌ళం అగ్ర‌నాయ‌క‌త్వం త‌ర‌లివ‌చ్చింది. అగ‌ర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో త్రిపుర‌ ముఖ్య‌మంత్రిగా విప్ల‌వ్ దేవ్ కుమార్ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, సీనియ‌ర్ నేత ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి, కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో పాటు…ఆ పార్టీ కురువృద్ధుడు అద్వానీ కూడా వ‌చ్చారు. మోడీ కంటే ముందు వ‌చ్చిన వారంతా వేదిక‌పై ఆసీనుల‌య్యారు. అనంత‌రం వేదిక‌పైకి వ‌స్తున్న ప్ర‌ధానికి గౌర‌వ‌సూచ‌కంగా అంద‌రూ లేచినిల‌బ‌డ్డారు. వేదిక‌పైకి వ‌స్తూ ప్ర‌ధాని ముందుగా అమిత్ షాకు,త‌ర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు న‌మ‌స్కారం చేశారు.

అయితే ఆయ‌న ప‌క్క‌నే ఉన్న అద్వానీ కూడా లేచి నిల‌బ‌డి… న‌మ‌స్కారం చేస్తున్నా… మోడీ ప‌ట్టించుకోలేదు. అద్వానీ ప‌క్క‌నే ఉన్న త్రిపుర మాజీ ముఖ్య‌మంత్రి మాణిక్ స‌ర్కార్ వ‌ద్దకు వెళ్లి… ఆయ‌న‌తో ఓ క్ష‌ణం మాట్లాడిన ప్ర‌ధాని..క‌నీసం అద్వానీ వైపు క‌న్నెత్త‌యినా చూడ‌లేదు. ప్రధాని మాణిక్ స‌ర్కార్ తో మాట్లాడుతున్నంత సేపూ అద్వానీ మోడీని చూస్తూనే ఉన్నారు. అయినా స‌రే మోడీ అద్వానీ వైపు చూడ‌కుండానే ముందుకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఎల్ కె అద్వానీని మోడీ అవ‌మానించార‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇప్పుడంటే బీజేపీ కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో అధికారం సాధించి బ‌లమైన పార్టీగా క‌నిపిస్తోంది కానీ… ఒక‌ప్పుడు లోక్ స‌భ‌లో కేవ‌లం రెండు సీట్ల‌కు ప‌రిమిత‌మైన బీజేపీని అధికార‌వైభ‌వం దిశ‌గా న‌డిపించ‌డానికి అద్వానీ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో దేశంలో ప్ర‌తిఒక్క‌రికీ తెలుసు. మిగ‌తా పార్టీల నేత‌లు సైతం అద్వానీ అనుభ‌వానికి గౌర‌వం ఇస్తుంటే సొంత‌పార్టీ అయి ఉండి మోడీ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.