మోడీ అసలు భయం బాబు కాదు, అద్వానీ…

Modi Scared to LK Advani not Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ప్రధాని మోడీ టీడీపీ, వైసీపీ ప్రవేశపెడుతున్న అవిశ్వాసాన్ని తప్పించుకోడానికి ఇన్ని ఎత్తులు చేయాల్సిన అవసరం లేదు. అయినా వేస్తున్నారు. టీడీపీ అవిశ్వాసం అయితే పెడుతుంది గానీ ప్రభుత్వాన్ని పడగొట్టలేదు అని తెలుసు. అలాంటిది బాబుకి మోడీ భయపడే పరిస్థితి లేదు. కానీ బీజేపీ సీనియర్ నేత అద్వానీకి భయపడడం వల్లే ఈ అవిశ్వాసం లోక్ సభలో చర్చకు రాకుండా మోడీ జాగ్రత్తపడుతున్నాడని బీజేపీ లో బలంగా వినిపిస్తున్న మాట. 2014 తరువాత బీజేపీ లో తనకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా మౌనంగా భరిస్తూ వస్తున్న అద్వానీ ఇటీవల త్రిపుర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా మోడీ కనీసం తన వందనాన్ని కూడా గుర్తించినట్టు ప్రవర్తించడాన్ని అద్వానీ జీర్ణించుకోలేకపోతున్నారట. అంతకుముందు నుంచే అద్వానీ అనుచరులు మోడీ మీద భగ్గుమంటున్నారు. వీరి సంఖ్య కాస్త అటుఇటుగా 50 దాకా ఉండొచ్చని మోడీకి తెలుసట. అవిశ్వాసం చర్చకు, ఓటింగ్ దాకా వస్తే ఈ 50 మంది అనూహ్యంగా తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని మోడీ భయపడిపోతున్నారట. అద్వానీ ఎక్కడా బయటపడకపోయినా లోపాయికారీగా తన వర్గాన్ని తన మీద యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడని మోడీ సందేహిస్తున్నాడట.

ఇక ఇప్పుడు అవిశ్వాసం తెచ్చిన చంద్రబాబుకి, అద్వానీతో వున్న సంబంధాలు కూడా మోడీలో ఈ అనుమానాలు పెరగడానికి ఇంకో కారణం అని తెలుస్తోంది. బాబుతో రాజకీయ పోరాటం వస్తే ఎలాగైనా నెగ్గొచ్చని భావిస్తున్న మోడీ తన గురువు అద్వానీ విషయంలో మాత్రం అంత ఆత్మవిశ్వాసం చూపలేకపోతున్నారట. ఇప్పటికే బీజేపీ తో పాటు జాతీయంగా అన్ని పార్టీల్లో అద్వానీ మీద సానుభూతి వ్యక్తం అవుతున్న విషయం మోడీకి బాగా అర్ధం అయ్యింది. అందుకే అద్వానీ అదును చూసి దెబ్బ కొడతారేమో అన్న భయంతో మోడీ వణికిపోతున్నారు. టీడీపీ మీద ఎదురు దాడి చేయాలని మోడీ భావిస్తున్నప్పటికీ బీజేపీలోని ముఖ్య నేతల్లో కేవలం 10, 15 శాతం మాత్రమే ఆ సూచనలు పాటిస్తున్నట్టు మోడీ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందట. అందుకే అవిశ్వాస తీర్మానం గురించి మోడీ ఇంతగా అభద్రతకు లోను అవుతున్నారు. 2014 లో మోడీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి మోడీ ఈ స్థాయిలో ఆందోళనకు లోను కావడం ఇదే మొదటిసారి అని పీఎంఓ అధికారులు కూడా చెప్పడం చూస్తుంటే గురువు రాజకీయ చాణుక్యం మీద ఆయన ఎంతగా వణికిపోతున్నారో అర్ధం అవుతుంది.