తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 20వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన భారీ బహరింగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు హనుమకొండలోని హాయగ్రీవచారీ గ్రౌండ్లో సభ నిర్వహణ కోసం స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు, జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. ఈ సభకు భారీస్థాయిలో జన సమీకరణ చేపట్టాలని టీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ మే నెలలో వరంగల్‌లో భారీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అంతకుముందు చేపట్టే ఈ సభను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.
సభా స్థలాన్ని పరిలించిన అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ తరువాత వరంగల్ నగరంపైనే సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద పెట్టి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. హాయగ్రీవ చారీ మైదానంలో 20వ తేదీ సాయంత్రం 4గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.