కుల‌భూష‌ణ్ ను చూసేందుకు భార్య‌కు,త‌ల్లికి అనుమ‌తి

kulbhushan jadhav mother and daughter to meet him on december 25

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉగ్ర‌వాదం, గూఢ‌చ‌ర్యం నేరంలో చిక్కుకుని పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భార‌తీయ ఖైదీ కుల‌భూష‌ణ్ జాద‌వ్ కుటుంబ స‌భ్యుల‌కు చిన్న ఊర‌ట ల‌భించింది. కుల‌భూష‌ణ్ ను క‌లిసేందుకు ఆయ‌న భార్య‌, త‌ల్లికి అనుమతి ఇస్తున్న‌ట్టు పాక్ విదేశాంగ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 25 క్రిస్మ‌స్ రోజున భార‌త ప్ర‌తినిధితో క‌లిసి వాళ్లు జాద‌వ్ ను చూడ‌నున్నారు. గ‌త నెల‌లో కుల‌భూష‌ణ్ భార్య‌కు మాత్ర‌మే ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి అనుమతి ఇస్తున్న‌ట్టు పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. అయితే మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించి ఆయ‌న త‌ల్లికి కూడా అనుమ‌తి ఇవ్వాల‌ని భార‌త విదేశాంగ‌మంత్రి సుష్మాస్వ‌రాజ్ పాకిస్థాన్ కు విజ్ఞ‌ప్తి చేశారు. పాక్ హై క‌మిష‌న‌ర్ తో దీనిపై చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. దీంతో కుల‌భూష‌ణ్ త‌ల్లికి కూడా ఆయ‌న్ను క‌లిసేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు పాక్ ప్ర‌క‌టించింది.

త‌మ దేశంలో గూఢచ‌ర్యానికి పాల్ప‌డ్డాడ‌ని, ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు దిగాడ‌ని ఆరోపిస్తూ పాకిస్థాన్ 2016లో కుల‌భూష‌ణ్ జాద‌వ్ ను అరెస్టు చేసింది. ఇండియ‌న్ నేవీ అధికారిగా ప‌నిచేసి ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన కుల‌భూష‌ణ్ ఇరాన్ లో వ్యాపారం చేసుకునేవార‌ని భార‌త్ అంటోంటే..అత‌ను ఇండియా రీసెర్చ్ అండ్ ఎనాల‌సిస్ వింగ్ రా అధికారి అని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. 2016 మార్చి 3న ఇరాన్ లో కుల‌భూష‌ణ్ ను అరెస్టు చేసిన పాకిస్థాన్ ఏప్రిలో ఆయ‌న‌పై ఉగ్ర‌వాదం, దేశ‌ద్రోహం కేసులు పెట్టింది.

పాకిస్థాన్ చ‌ర్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టిన భార‌త్ కుల‌భూష‌ణ్ కు భార‌తీయ గూఢాచార సంస్థ‌తో ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టంచేసింది. వెంట‌నే అత‌న్ని విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసింది. కానీ భార‌త్ కోరిక‌ను పాకిస్థాన్ తోసిపుచ్చింది. కుల‌భూష‌ణ్ కేసు విచార‌ణ‌ను ఆద‌రాబాద‌రాగా పూర్తిచేసి ఈ ఏడాది ఏప్రిల్ లో ఉరిశిక్ష విధించింది. దీనిని వ్య‌తిరేకిస్తూ భార‌త్ అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో అప్పీలు చేసింది. భార‌త్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఉరిశిక్ష‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని పాకిస్థాన్ ను ఆదేశించింది. దీంతో కుల‌భూష‌ణ్ ప్ర‌స్తుతం ఉరిశిక్ష ప‌డ్డ ఖైదీగా పాక్ జైల్లో రోజులు వెళ్ల‌దీస్తున్నాడు.