ఐదేళ్ల కోసం చిన్న చిన్న స‌ర్దుబాట్లు

kumara swamy meets Sonia Gandhi and Rahul Gandhi for his Oath Ceremony

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీని ఢీకొని సాహసోపేతంగా ఏర్పాటుచేస్తున్న జేడీఎస్, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఐదేళ్ల‌పాటు దిగ్విజ‌యంగా కొన‌సాగించాల‌న్న భావ‌న‌లో ఉన్నారు కుమార‌స్వామి. కాంగ్రెస్ క‌న్నా త‌క్కువ స్థానాలు సాధించిన‌ప్ప‌టికీ… ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌న‌కే వదిలేస్తున్న కాంగ్రెస్ పై కుమార‌స్వామి కృత‌జ్ఞ‌త‌తో ఉన్నారు. అందుకే మంత్రి ప‌ద‌వులు స‌హా అన్ని విష‌యాల్లోనూ ప‌ట్టువిడుపుల ధోర‌ణితో ముందుకెళ్లాల‌ని భావిస్తున్నారు. త‌న ప్ర‌మాణ‌స్వీకార కార్యక్ర‌మానికి రావ‌ల్సిందిగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీని ఆహ్వానించేందుకు సోమ‌వారం ఢిల్లీ వెళ్లిన కుమార‌స్వామి అనేక‌విష‌యాల‌పై వారితో చ‌ర్చించారు.

త‌మ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌పాటు మ‌నుగ‌డ సాధించేలా చొర‌వ తీసుకోవాల‌ని కుమార‌స్వామి కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌ను కోరారు. ప‌ద‌వుల‌ను ఇచ్చిపుచ్చుకుందామ‌ని, ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి బేష‌జాలూ లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. స్పీక‌ర్, కొన్ని మంత్రిత్వ‌శాఖ‌ల కోసం జేడీఎస్ ప‌ట్టుబ‌డుతోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో కుమార‌స్వామి వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ప్ర‌స్తుతానికి రెండు పార్టీలు సుహృద్భావ వాతావ‌ర‌ణంలోనే ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలో పాల‌న సజావుగా సాగేందుకు కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని, ఎలాంటి అవాంత‌రాలు ఎదురైనా త‌క్ష‌ణం జోక్యం చేసుకుంటుంద‌ని అగ్ర‌నేత‌లు కుమార‌స్వామికి భరోసా ఇచ్చారు.

రైతుల రుణ‌మాఫీతో పాటు, జేడీఎస్ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ప్ర‌క‌టించిన ప‌థకాల అమ‌లుకు కూడా కాంగ్రెస్ ప‌చ్చ‌జెండా ఊపింది. ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి విష‌యంలో దేవెగౌడ అసంతృప్తితో ఉన్నార‌న్న వార్తల నేప‌థ్యంలో రెండు ఉప‌ముఖ్య‌మంత్రుల ప‌ద‌వులు సృష్టించినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు స్ప‌ష్టంచేశారు. మొత్తానికి ఉమ్మ‌డి శ‌త్రువు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, జేడీఎస్ చిన్న‌చిన్న‌విష‌యాల్లో విభేదాల‌కు తావులేకుండా స‌ర్దుబాట్లు చేసుకోవాల‌ని భావిస్తున్నాయి.