కుమార‌స్వామి అను నేను….

Kumaraswamy sworn in as the chief minister

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అనేక నాట‌కీయ ప‌రిణామాలకు వేదికయిన క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వం కొలువుదీరింది. జేడీఎస్-కాంగ్రెస్ కూట‌మి ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. విధాన సౌధ తూర్పుద్వారం మెట్ల వ‌ద్ద ఏర్పాటుచేసిన భారీ వేదిక‌పై గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా క‌ర్నాట‌క 24వ ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామితో ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం ఉప‌ముఖ్య‌మంత్రిగా కాంగ్రెస్ నేత ప‌ర‌మేశ్వ‌ర ప్ర‌మాణం చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి భారీ సంఖ్య‌లో కాంగ్రెస్, జేడీఎస్ నేత‌లు, ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. మూడువేల‌మందికి పైగా వీఐపీలు ప్ర‌త్యేక అతిథులుగా వ‌చ్చారు.

కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ జాతీయఅధ్య‌క్షుడు, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరీ, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌న్, ప‌శ్చిమ‌బెంగ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ త‌దిత‌ర నేత‌లు హాజ‌ర‌య్యారు. కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి కావ‌డం ఇదిరెండో సారి. 2006లో బీజేపీ మ‌ద్ద‌తుతో తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన కుమార‌స్వామి 20నెల‌లు మాత్ర‌మే ప‌ద‌విలో ఉన్నారు. అధికార బ‌దిలీకి కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డంతో బీజేపీ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంది. దీంతో కుమార‌స్వామి సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి అయ్యారు. కుమార‌స్వామి ప్ర‌భుత్వం బ‌ల‌నిరూప‌ణ చేసుకున్న అనంత‌రం మిగ‌తా మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం చేయనున్నారు. కూట‌మి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ కు 22 మంత్రి ప‌ద‌వులు, జేడీఎస్ కు 12 మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. స్పీక‌ర్ ప‌ద‌వి కాంగ్రెస్ కు, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి జేడీఎస్ కు ద‌క్కాయి.