వైద్యుల నిర్లక్ష్యం… మహిళ గుండెల్లో ఇంజెక్షన్ సూది !

Kumbakonam Doctors neglects, injections needle kept in women heart

వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అలాంటిది ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళితే ఉన్న ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటిదే వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే సంఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఓ గర్భిణి చేతికి ఇంజెక్షన్‌ వేస్తుండగా విరిగిన సూదిని వెంటనే తీయకపోవడంతో ఆ సూది గుండె వరకు వెళ్లింది. ఫలితంగా ప్రాణాల మీదకు వచ్చింది. కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన శశికళ (23) జ్వరంతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.

అక్కడి నర్సులు ఆమెకు ఇంజెక్షన్ చేస్తుండగా సూది విరిగి ఛాతిలో ఉండిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు ఛాతిలో నొప్పి ఎక్కువ కావడంతో తిరిగి ఆసుపత్రికి వచ్చిన ఆమెకు ఎక్స్‌రే తీసి ఛాతిలో సూది ముక్క ఉన్నట్టు చెప్పారు. దీంతో తంజావూరు వైద్య కళాశాలలో ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది ముక్కను తొలగించినట్టు చెప్పారు. ఈ ఘటనపై శశికళ మాట్లాడుతూ వైద్యులు తనను మోసగించారని, ఆపరేషన్ చేసి సూదిని తొలగించినట్టు చెప్పారని అంటోంది ప్రస్తుతం శశికళ మూడు నెలల గర్భవతి. ఈ ఘటనపై స్పందించేందుకు తంజావూరు వైద్య కళాశాల వైద్యులు నిరాకరించారు.