Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ తనను పిచ్చోడని సంబోధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఆవేదన వ్యక్తంచేశారు. కురియన్ పేరిట బహిరంగ లేఖ రాసిన కేవీపీ…ఏపీకి జరిగిన అన్యాయం చూసి తాను పిచ్చోడినే అయ్యాయని వ్యాఖ్యానించారు. కురియన్ తనను తీవ్రంగా అవమానపరిచారని, అయినా తాను బాధపడడంలేదని అన్నారు. కురియన్ వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయని, హక్కుల సాధనకై పోరాడుతున్న ఏపీ ప్రజల్ని అవమానించారని ఆరోపించారు.
పార్లమెంటరీ సంప్రదాయాలకు కట్టుబడే తాను మౌనంగా ఉండిపోయానని, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించినా…మౌనంగానే ఉన్నానని, లోక్ సభ ఆర్డర్ లో లేని వేళ, విభజన బిల్లును ఆమోదించినా..మౌనంగా ఉన్నానని, ఇకపై అలా ఉండబోనని కేవీపీ హెచ్చరించారు. బడ్జెట్ లో ఏపీకి సరైనకేటాయింపులు లేకపోవడంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలకతీతంగా నేతలందరూ కూడా బడ్జెట్ పై పెదవివిరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ గొంతును కేవీపీ రాజ్యసభలో వినిపించే ప్రయత్నంచేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాజ్యసభ పోడియంలోకి కేవీపీ దూసుకెళ్లిన సమయంలో కురియన్ తీవ్రంగా స్పందించారు. మీకేమైన పిచ్చిపట్టిందా…? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ ఘాటువ్యాఖ్యలు చేశారు.