కాషాయ తీర్థం పుచ్చుకున్న కుష్బూ

కాషాయ తీర్థం పుచ్చుకున్న కుష్బూ

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, నటి కుష్బూ బీజేపీలో చేరారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆమెకు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉంది. ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన కుష్బూ పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏమాత్రం ప్రజాబలం లేని నాయకుల చేతిలో కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు.

అంతేకాకుండా తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపారు. కాగా 2010లో డీఎంకేలో చేరిన కుష్బూ ఆ పార్టీ నేతలతో విభేదించి 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు. తాజాగా బీజేపీలో చేరడంతో పదేళ్ల కాలంలోనే మూడు పార్టీలను మారినట్లు అయ్యింది.