దోచుకుంటున్న కరోనా ల్యాబ్‌లు

దోచుకుంటున్న కరోనా ల్యాబ్‌లు

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రైవేట్‌ ల్యాబ్‌లు బాధితులను దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధరల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. తాజాగా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గినా, తెలంగాణలో మాత్రం తగ్గిన ధరలు అమలు కావట్లేదు. ఆ మేరకు తక్కువ వసూలు చేయాలన్న ఆదేశాలనూ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఇవ్వలేదు. ఇదే అదనుగా ప్రైవేట్‌ లేబొరేటరీలు తక్కువ ధరకు కిట్లను కొని ఎక్కువ ధరకు టెస్టులు చేస్తుండటంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు.

కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసినందుకు రూ. 3 వేలపైనే వసూలు చేస్తున్నారు. మరోవైపు పీపీఈ కిట్ల ధరలను కూడా అధికంగా వేస్తూ లేబరేటరీలు సహా ఆసుపత్రులు బాధితుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. అలాగే కరోనా రోగులు వాడే రెమిడెసివీర్‌ ఇంజక్షన్‌ ధర కూడా మార్కెట్లో తగ్గినా, పాత ధరనే ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు.