బాబుదే అధికారం….ఎన్ని సీట్లంటే ?

Complaint File On Lagadapati

తెలుగు వారు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న లగడపాటి సర్వే వివరాలు వచ్చేశాయి. తెలంగాణ టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి… ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడించారు.175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశ ఉందని లగడపాటి తెలిపారు. ఈ లెక్కన చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక లోక్ సభ స్థానాల విషయంలోనూ టీడీపీకే మొగ్గు ఉందని లగడపాటి సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13-17, వైసీపీ 8-12, ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే అంచనా వేసింది. మహిళా ఓటర్లు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గుచూపారని పురుష ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేశారని ఈ సర్వేలో తేలింది. ఇక యువత ఓట్లు జనసేనకు ఎక్కువగా పడినట్టు సర్వే అభిప్రాయపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకంగా కొంతమేర ఉందని ఈ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 40 నుంచి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేనకు 10 నుంచి 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా పార్టీలకు ఈ స్థాయిలో ఓట్లు దక్కొచ్చని సర్వేలో తేలింది.