కుండ బద్దలు కొట్టిన లగడపాటి….సైకిల్ దే ఏపీ !

Complaint File On Lagadapati

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని మల్కాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే కాకుండా, కేంద్రంలో ఎవరు వస్తారన్న దానిపైన కూడా రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు రేపు సాయంత్రం కొద్దిగా స్పష్టతనిస్తాయని, ఈ నెల 23తో పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. ఇటీవల తాను ఓ ఫంక్షన్ ఉండడంతో ఫారెన్ ట్రిప్ వెళ్లానని, అక్కడి ఎన్నారైలు రాష్ట్ర పరిస్థితిపై ఎంతో ఆసక్తి చూపించారని లగడపాటి వెల్లడించారు. మనం కోరుకోకుండానే రాష్ట్రం వచ్చిందని, ఇది ఎలా అభివృద్ధి అవుతుందోనని వారు ఆరాటం ప్రదర్శించారని చెప్పారు. “పురాణాల్లో మనం చదువుకున్నాం. ఆనాడు పాండవులకు వేరుగా రాజ్యం ఇచ్చినప్పుడు ఖాండవ వనాన్ని ఇచ్చారు. దాన్ని వాళ్లు ఇంద్రప్రస్థం పేరుతో అద్భుతమైన రాజధానిగా మలుచుకున్నారు. అమరావతిలో కూడా 29 గ్రామాలు రాజధానిలో ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. తాము ఇచ్చిన భూములతో రాజధాని గొప్పగా ఉంటుందా అన్నది వాళ్ల సందేహం! అందుకే రాబోయే పాలకులు ఎవరన్నదానిపై మాట్లాడుకుంటున్నారు. వాళ్లు బాధపడాల్సిన పనేమీ లేదని చెప్పాను. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అద్భుతంగా ఉండబోతోందని, ఇంద్రప్రస్థం స్థాయిలో అమరావతి ఎవరూ ఊహించనంత దివ్యంగా ఉంటుందని చెప్పాను. రాబోయే రోజుల్లో మన శాసనసభను కూడా మయసభతో పోల్చి చెప్పుకుంటారు. గిట్టనివాళ్లు అసూయపడేలా రాజధాని తయారవుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు మారినా ఎలాంటి తేడారాదు. దేశంలో ఇలాంటి పరిస్థితి కొన్నిసార్లు వచ్చింది కానీ, ఎక్కడా అభివృద్ధి రివర్స్ అయిన దాఖలాలు లేవు. అడుగు ముందుకే పడింది తప్ప వెనక్కి వెళ్లింది ఎక్కడా లేదు కాబట్టి ఎవరొచ్చినా అభివృద్ధి ఆగదు. కాకపోతే కొత్త ప్రభుత్వాలు వస్తే కాస్త అటూఇటూగా ఉంటుంది తప్ప పెద్దగా మార్పేమీ ఉండదు” అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు. తాను ఆదివారం తిరుపతి వెళ్తున్నానని అక్కడ ఎన్నికలపై సర్వే ఫలితాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు, ఏపీలోని లోక్ సభ, అసెంబ్లీ ఫలితాలను వెల్లడిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కారు ఎక్కితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ ఎక్కేశారని లగడపాటి స్పష్టం చేశారు. ఏదో ఒక పార్టీకే ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలన్నదే తమ అభిమతమన్నారు.