బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా నటులు, క్రీడాకారుల జీవితాలను, యదార్థ సంఘటనలను తెరకెక్కిస్తోన్న బాలీవుడ్ ఇప్పుడు రాజకీయ నాయకులపై దృష్టిపెట్టింది. భారత మాజీ ప్రధాని, జై జవాన్, జైకిసాన్ నినాదం సృష్టికర్త దివంగత లాల్ బహదూర్ శాస్త్రి జీవితాన్ని తెరకెక్కించనుంది. గురువారం శాస్త్రి 52వ వర్ధంతి సందర్భంగా ఈ సినిమా వివరాలు వెల్లడించారు ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి. శాస్త్రి బయోపిక్ కు ద తాష్కెంట్ ఫైల్స్ అనే పేరు నిర్ణయించినట్టు చెప్పారు. నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తారని తెలిపారు.
లాల్ బహదూర్ శాస్త్రి 1904లో జన్మించారు. 1964 జూన్ నుంచి 1966 జనవరి వరకు భారత రెండో ప్రధానమంత్రిగా పనిచేశారు. 1965లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య సయోధ్యకు రష్యా మధ్యవర్తిత్వం వహించింది. రష్యాలోని తాష్కెంట్ లో ఇరు దేశాల అధినేతలు సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. 1966 జనవరి 11న ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు. ఆయనది సహజమరణమా లేక ఎవరైనా హత్య చేశారా అనే విషయమై ఇప్పటికీ స్పష్టతలేదు.
దేశప్రధానులందరిలోకి అత్యంత నిజాయితీగల ప్రధానిగా శాస్త్రి పేరుతెచ్చుకున్నారు. అటు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీట్విట్టర్ లో నివాళులర్పించారు. భారతావని గర్వించదగ్గ గొప్పనాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని, ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన సేవలు మరువలేనివని మోడీ కొనియాడారు. తరతరాలు గుర్తుండిపోయే వ్యక్తని, ఆదర్శప్రాయుడని అంజలి ఘటించారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలను ఏకం చేసి పాలించిన గొప్ప నాయకుడని, ఆయన బాటలోనే ప్రజల్లో ఐకమత్యాన్ని ఏర్పరచడమే తమ ముందున్న కర్తవ్యమని, జోహార్ శాస్త్రి అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు