చిట్ట చివరి గ్రహణం

చిట్ట చివరి గ్రహణం

ఈ ఏడాది చిట్ట చివరి గ్రహణం శనివారం ఏర్పడనుంది. పదిహేను రోజుల కిందట చంద్రగ్రహణం ఏర్పడగా.. ఇది సూర్య గ్రహణం. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం, అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడతాయి. అయితే, అన్ని పౌర్ణమిలు, అమావాస్యల్లో గ్రహణాలు ఏర్పడవు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపైకి వచ్చిన సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు చంద్రుడి నీడ సూర్యుడిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

ఏడాదిలో నాలుగు నుంచి ఆరు గ్రహణాలు సంభవిస్తాయి. ఈ ఏడాది మాత్రం నాలుగు గ్రహణాలే ఏర్పడగా.. ఇందులో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు. ఇప్పటికే మూడు గ్రహణాలు ముగిసిపోగా.. చిట్టచివరిది శనివారం సంభవిస్తోంది. అయితే, ఇది పాక్షిక గ్రహణమే అయినప్పటికీ..కొన్ని దేశాల్లోని ప్రజలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతారు. గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు ఆరు గంటల పాటు కొనసాగనుంది.

దక్షిణార్ద్ర గోళంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. అంటార్కిటికా, అట్లాంటిక్ దక్షిణ తీర ప్రాంత దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది. సెయింట్‌ హెలెనా, నమీబియా, జార్జియా దక్షిణ ప్రాంతం, దక్షిణాఫ్రికా, శాండ్‌విచ్‌ దీవులు, క్రోజెట్‌ దీవి, లెసొతొ, ఫాక్‌లాండ్‌ దీవి, చిలీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలిపింది.

భారత్‌లో మాత్రం ఇది కనిపించదని నాసా స్పష్టం చేసింది. భారత ప్రమాణిక కాలమానం ప్రకారం.. డిసెంబరు 4న ఉదయం 10 గంటల 59 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:07 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:33 గంటలకు గరిష్ఠ స్థితికి చేరుకుని క్రమంగా తగ్గుతుంది. 3:07 గంటలకు గ్రహణం ముగియనుంది.

ఈ ఏడాదిలో మే 26న సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్‌ 10 పాక్షిక సూర్యగ్రహణం, నవంబర్‌ 19 పాక్షిక చంద్రగ్రహణాలు కనువిందు చేశాయి. ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ నుంచి లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయడానికి సన్నాహాలు చేసింది. నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది. అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం తిరిగి ఏడాదిన్నర తర్వాత 2023 ఏప్రిల్ 20న ఏర్పడనుంది.