అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఉత్తరాది భామ లావణ్య త్రిపాఠి. తొలి సినిమా అనుకున్న స్థాయిలో ఆడకున్నప్పటికీ.. లావణ్య అందానికి, అభినయానికి మంచి పేరే వచ్చింది. ఆమెకు ఆ తర్వాత అవకాశాలకు లోటు లేదు. కానీ లావణ్య సక్సెస్ రేట్ మరీ తక్కువ కావడంతో కెరీర్ అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగలేదు.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా తప్పితే పెద్ద హిట్లు లేవు ఆమె కెరీర్లో. అందులోనూ గత రెండు మూడేళ్లలో లావణ్య పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. సక్సెస్ అన్న పదానికే ఆమె అర్థం మరిచిపోయింది. వరుస డిజాస్టర్లు కెరీర్ను బాగా దెబ్బ తీసేశాయి. అర్జున్ సురవరం మీద ఆశలు పెట్టుకుంటే అది వాయిదా పడిపోయింది.
దీంతో లావణ్యను తెలుగు ప్రేక్షకులు నెమ్మదిగా మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో సినిమానే లేదు. ఎట్టకేలకు అర్జున్ సురవరం రిలీజ్కు రెడీ అయిన నేపథ్యంలో మీడియాను కలిసేందుకు వచ్చింది లావణ్య. మరి కెరీర్లో ఇంత గ్యాప్ వచ్చిందేంటని మీడియా వాళ్లు అడిగితే.. భలే కవర్ చేసిందామె. ఈ గ్యాప్లో తనకు చాలా ఆఫర్లు వచ్చాయని.. కానీ తానే ఒప్పుకోలేదని లావణ్య చెప్పడం గమనార్హం. నా కెరీర్లో గ్యాప్ రాలేదు. నేనే తీసుకున్నా. వరుసపెట్టి సినిమాలు చేస్తూ సంఖ్య పెంచుకోవడం నాకు ఇష్టం లేదు అని లావణ్య చెప్పింది.