పేద కుటుంబానికి అండ‌గా నిలిచిన లారెన్స్

lawrence support to poor family

రాఘ‌వ లారెన్స్ .. ఈయ‌న న‌టుడి క‌న్నా కూడా మంచి మాన‌వ‌తావాదిగా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి వెంట‌నే గుర్తు కొచ్చేది లారెన్స్ పేరే. ఇప్ప‌టికే ఎంతో మంది చిన్నారులకి గుండె సంబంధింత ఆప‌రేష‌న్స్ చేయించిన లారెన్స్ ప్ర‌క‌తి వైప‌రీత్యాల వ‌ల‌న న‌ష్ట‌పోయిన వారికి త‌న వంతు సాయం చేశాడు. తాజాగా ఓ పేద కుటుంబానికి అండ‌గా నిలిచాడు. వారి కుమారుడి వైద్యానికి అవ‌స‌ర‌మైన సాయాన్ని తాను చేస్తాన‌ని భరోసా ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

రాజపాళైయంకు చెందిన యువతి గృహలక్ష్మీ. ఆమెకి మేనమామతో వివాహం జ‌రిగింది. కొన్నాళ్ళ త‌ర్వాత పండంటి కొడుకు పుట్టాడు. కొడుకుకి గురుసూర్య అని పేరు పెట్టారు. ఆ పిల్లాడికి రెండేళ్ల వయసు వరకూ నడవలేక పోయాడు మాటలు రాలేదు. దీంతో గృహ‌ల‌క్ష్మీ భ‌ర్త వారిని వ‌దిలి వెళ్ళాడు. ఈ స‌మ‌యంలో త‌న త‌మ్ముడు వెంక‌టేశ‌న్ సాయం తీసుకొని ప‌లు ఆసుప‌త్రుల‌కి కూడా తిరిగింది. అన్ని ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్ట‌డంతో చాలా ఆందోళ‌న చెందింది. ఈ స‌మ‌యంలో గృహ‌ల‌క్ష్మీకి న‌టుడు లారెన్స్‌ని క‌లిస్తే త‌ప్ప‌క సాయం చేస్తార‌ని చెప్ప‌డంతో కొద్ది రోజుల క్రితం త‌మ్ముడు, కుమారుడితో క‌లిసి చెన్నైకి వ‌చ్చింది. లారెన్స్ అడ్రెస్ అడిగింది. ఎవ‌రు చెప్ప‌క పోవ‌డంతో దిక్కు తోచ‌ని స్ధితిలో కొద్ది రోజులుగా బిచ్చ‌మెత్తుకుంది. వీరి గురించి ఒక తమిళ పత్రిక వార్త ప్రచురించడంతో అది లారెన్స్‌ దృష్టికి చేరింది.

విష‌యం తెలుసుకున్న లారెన్స్ త‌న అనుచరుల‌ని పంపి వారిని వెతికి తీసుకురమ్మ‌ని చెప్పాడు. ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఆ ముగ్గురిని లారెన్స్ ఇంటికి తీసుకొచ్చారు. లారెన్స్ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వైద్య సాయం కోసం వచ్చిన వారికి నా ట్ర‌స్ట్ ద్వారా త‌ప్ప‌క సేవ‌లు అందిస్తాను లేదంటే ప్ర‌భుత్వాన్ని సాయం చేయ‌మ‌ని కోర‌తాన‌ని పేర్కొన్నాడు. ఈ వ్య‌వ‌హారాన్ని త‌న దృష్టికి తీసుకొచ్చిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు అని కూడా చెప్పాడు. ప్ర‌స్తుతం తాను అక్ష‌య్ కుమార్ హీరోగా కాంచ‌న చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో ఈ చిత్రం ల‌క్ష్మీ బాంబ్ పేరుతో రూపొందుతుంది.