కర్నూల్ లో దారుణం… మృతి చెందిన గర్భిణిని అడవిలో వదిలేసి..

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. మూఢ నమ్మకాలను నమ్మేవారి సంఖ్య సమాజంలో రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా నమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉండే మూఢ నమ్మకాలు మరీ దారుణంగా ఉంటాయి. కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో మూఢ నమ్మకాలు అత్యధికంగా ఉన్నాయనడానికి తాజాగా జరిగిన ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లి గ్రామంలో గర్భంతో ఉన్న లావణ్య అనే మహిళ ప్రసవం కోసం నంద్యాల ఆసుపత్రికి వెళ్ళింది. అయితే.. అక్కడ ఆ మహిళ ప్రసవించకుండానే మరణించింది. దీంతో ఆ మహిళను గ్రామానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని స్థానికులు ఆ మహిళ మృతదేహాన్ని అడ్డుకున్నారు. గర్భిణితో ఉన్న మహిళ మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తే గ్రామానికి అరిష్టమని.. మహిళను అడవిలోనే వదిలేయాలని గ్రామస్తులు పట్టుబడటంతో, మహిళ మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. అడవిలో మహిళ మృతదేహాన్ని చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.