మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోని పటేల్ చెరువులో రెండు మూడు రోజుల కిందటే ఏడేళ్ల వయసు గల చిరుత చెరువులో పడి మృతి చెందగా, మంగళవారం కళేబరం చెరువులో తేలింది. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానిక రైతులు చిరుత కళేబరాన్ని గమ నించి సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్.. అటవీ శాఖ, రెవెన్యూ అధికారులకు తెలిపారు.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణాగౌడ్, రామాయంపేట ఫారెస్ట్ రేంజర్ నజియాతబుసం, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముళ్ల పంది దాడి చేసినట్టు భావిస్తున్నారు. పొట్టభాగంలో గాయమైనట్లు గుర్తించారు. చిరుత అవయవ భాగాలను సేకరించి సంగారెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అనుమా నాస్పద స్థితిలో చెరువులో పడి చిరుత మృతి చెందిందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు.