గత వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలతో రాష్ట్రం వణికిపోయిందని, తమ ప్రభుత్వంలో ఆ తరహా చర్యలను సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని కిరాతకంగా హత్య చేసిన వారిని వదిలిపెట్టబోమని, హంతకులు భూమిలో దాక్కున్నా పట్టుకుని శిక్షించి తీరుతామని అన్నారు. మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి దారుణ హత్యోదంతంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.