క్వాలిఫయింగ్ సెషన్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అద్భుతంగా రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదే జోరు కొనసాగించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే ముందుగా గంటా 22 నిమిషాల 50.683 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ గెలిచాడు.
హామిల్టన్ కెరీర్లో ఇది 85వ టైటిల్ కావడం విశేషం. జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ (91) పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు హామిల్టన్ మరో ఆరు విజయాల దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందగా… వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్లు వెటెల్, లెక్లెర్క్ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్క్రమించారు. సీజన్‌లోని మూడో రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది.