టాప్‌ ర్యాంక్‌లో ఉన్న మెస్సీ

టాప్‌ ర్యాంక్‌లో ఉన్న మెస్సీ

అంతర్జాతీయస్థాయిలో తన జట్టుకు ఎలాంటి గొప్ప టైటిల్స్‌ అందించలేకపోయినా… ఆర్జనలో మాత్రం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ లయెనల్‌ మెస్సీ టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ఫోర్బ్స్‌’ పత్రిక వివరాల ప్రకారం ఈ ఏడాది అత్యధిక మొత్తం సంపాదించిన ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో మెస్సీకి తొలి స్థానం దక్కింది. అతను ఈ ఏడాదిలో 12 కోట్ల 60 లక్షల డాలర్లు (రూ. 927 కోట్లు) ఆర్జించాడు. ఇందులో 9 కోట్ల 20 లక్షల డాలర్లు వేతనం ద్వారా రాగా… మిగతా 3 కోట్ల 40 లక్షల డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు.

15 ఏళ్ల నుంచి స్పెయిన్‌కు చెందిన విఖ్యాత క్లబ్‌ బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీ ఈ ఏడాది బార్సిలోనా జట్టు ఒక్క టైటిల్‌ కూడా సాధించకపోవడంతో క్లబ్‌ను వీడాలనుకుంటున్నానని తెలిపాడు. కానీ ఒప్పందం ప్రకారం మెస్సీ వచ్చే ఏడాది వరకు బార్సిలోనా జట్టుతోనే ఉండాలి. ముందుగానే వెళ్లిపోతే భారీస్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెస్సీ తన ఆలోచనను విరమించుకొని మరో ఏడాదిపాటు బార్సిలోనాతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు.

మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా గొప్ప విజయాలేమీ సాధించకపోయినా… యూరప్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌ పోటీల్లో మాత్రం మెస్సీ మహిమతో బార్సిలోనా జట్టు 34 ట్రోఫీలు సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాలర్‌గా పేరున్న పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 11 కోట్ల 70 లక్షల డాలర్ల (రూ. 860 కోట్లు) ఆర్జనతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటలీలో యువెంటస్‌ క్లబ్‌కు ఆడుతున్న రొనాల్డో వేతనం ద్వారా 70 కోట్ల డాలర్లు… ఎండార్స్‌మెంట్ల ద్వారా 47 కోట్ల డాలర్లు పొందాడు. మెస్సీ, రొనాల్డో తర్వాత మూడో స్థానంలో నేమార్‌ (బ్రెజిల్‌–పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌–పీఎస్‌జీ), నాలుగో స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్‌–పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌), సలా (ఈజిప్ట్‌–లివర్‌పూల్‌) ఉన్నారు.