అదృశ్యమైన బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో చోటు చేసుకుంది. దావల యశ్వంత్‌కుమార్ (8) మృతదేహం గొరిజవోలు, సంక్రాంతిపాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నుదురుపాడుకు చెందిన లక్ష్మి 10 ఏళ్ల క్రితం దావల నాగేశ్వరబాబును కులాంతర వివాహం చేసుకుంది. వీరికి యశ్వంత్‌కుమార్, ఆరేళ్ల జ్యోతి ఉన్నారు.
ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో మేనమామ పల్లపు వీరాస్వామి గొరిజవోలుకు తీసుకొచ్చి నివాసం ఏర్పాటు చేశాడు. ఈ నెల 18న తన కుమారుడు యశ్వంత్‌కుమార్ పుట్టినరోజు కావటంతో కేక్ తీసుకొనిరావడానికి బయటకు వెళ్లిన తిరిగి వచ్చేసరికి ఇంట్లో కుమారుడు కనిపించకపోవటంతో అదేరోజు పోలీసులకు లక్ష్మి ఫిర్యాదు చేసింది. లక్ష్మి కుమార్తె జ్యోతి.. వీరాస్వామి యశ్వంత్‌ను కొట్టి చంపి గోతంలో వేసి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడని తన తల్లికి చెప్పింది. ఈ విషయాన్ని పోలీసులకు వివరించడంతో.. గాలింపు కొనసాగించి మృతదేహాన్ని కనుగొన్నారు.