జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ టీవీ చానల్ వీడియో జర్నలిస్టుగా పని చేస్తున్న రంజిత్, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎక్కడి వెళ్లాడో తెలియని బాలుడు.. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు.
గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా తమకు తెలుస్తుందని, మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పి దుండగులు ఫోన్ పెట్టేశారు.
దీంతో ఏం చేయాలో తెలియక బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా కిడ్నప్ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ నరేష్ కుమార్, పట్టణ సీఐ రవికుమార్, డీసీఆర్బీ సీఐ సాగర్, ఆరుగురు ఎస్ఐలు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, పలువురు అనుమానితులను ప్రశ్నించారు. పట్టణంలో కిడ్నాపర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫోన్ చేసినా.. ప్రైవేట్ ఫోన్ నంబర్లతో చేస్తుండడం వల్ల వారి ఆచూకీని కనిపెట్టలేక పోతున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఎమ్మెల్యే శంకర్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులను కోరారు.