మహమ్మారి వైరస్ విజృంభిస్తుండడంతో మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించారు. రోజుకు 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరికొత్త నిబంధనలు విధిస్తూ బృహన్ ముంబై కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైతో పాటు విదర్భ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో సరికొత్త నిబంధనలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విదర్భ ప్రాంతంలోని అమరావతి, యావత్మాల్ జిల్లాలో పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అమరావతి జిల్లాలో వారాంతాల్లో లాక్డౌన్ పాక్షికంగా సడలించారు. ఇక ముంబైలో శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తూ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. మాస్క్‌లు లేకుండా తిరిగే వారిని గుర్తించడానికి 300 మంది మార్షల్స్‌ను బీఎంసీ ఏర్పాటుచేసింది. మాస్క్‌లను లేని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు.
28వ తేదీ వరకు విద్యాలయాలన్నీ మూసివేస్తూ యావత్మాల్ జిల్లా అధికారులు ప్రకటించారు. పెళ్లిళ్లకు కేవలం 50 మంత్రిని మాత్రమే అనుమతిస్తూ కలెక్టర్ డీఎం సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్స్ ఉదయం 8 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరచుకోవచ్చు. రెండు జిల్లాల్లో రాత్రిళ్లు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయించారు. రాత్రి కర్ఫ్యూ వాతావరణం అమల్లో ఉండనుంది.
ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 20,81,520. మృతుల సంఖ్య 51,669. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు, మృతుల సంఖ్య నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుండగా మహారాష్ట్రలో పెరుగుతుండడంతో తాజా లాక్డౌన్ విధించారు. తాజాగా గురువారం 5,427 కేసులు నమోదయ్యాయి.