వలసకూలీల పాలిట శాపంగా మారిన లాక్‌డౌన్

వలసకూలీల పాలిట శాపంగా మారిన లాక్‌డౌన్

లాక్‌డౌన్‌ వలసకూలీల పాలిట శాపంగా మారింది. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకన సొంతూర్ల బాట పట్టిన వలసకూలీలు వరుసగా రోడ్డు ప్రమాదాల బారీన పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ల్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు మృతి చెందారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్థరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.కాగా ప్రమాద సమయంలో ట్రక్కుల్లో మొత్తం 60 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరంతా మహారాష్ట్ర నుంచి స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం బారీన పడ్డారు. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.